బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గులాబీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కొందరు కేటీఆర్ పేరుతో కేకులు కట్ చేస్తుండగా, మరికొందరు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేశారు. కొందరు ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.
Annayya
Many Happy Returns of the day!! @KTRBRS— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 24, 2025
సోషల్ మీడియాలోనూ కేటీఆర్‌కి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా సోషల్ మీడియా ద్వారా తన అన్నకు శుభాకాంక్షలు తెలిపారు. ‘X’ (ట్విట్టర్) వేదికగా “అన్నయ్య.. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అంటూ సింపుల్‌గా విషెస్ చెప్పింది. దీన్ని చూసిన నెటిజన్లు వేరువేరు రకాలుగా స్పందిస్తున్నారు. “కవితగారు గొడవలు పక్కన పెట్టి అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం మంచిదే” అని కొందరు కామెంట్ చేస్తుండగా, “నీ పతనం కోరుకునే వారికీ నువ్వు మంచే కోరుకుంటున్నావు.. నీది మంచి మనసే” అంటూ మరికొందరు రిప్లై చేస్తున్నారు.
ఇక ఇటీవల కవిత, కేటీఆర్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కవిత కేసీఆర్‌కి రాసిన లేఖ లీక్ కావడం, అందులో చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారాయి. “కేసీఆర్ దేవుడు, కానీ చుట్టూ దయ్యాలే ఉన్నారు.. పార్టీలో కొవర్టుల రాజ్యం నడుస్తోంది” అని కవిత చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ అండ్ కోకే అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత సోషల్ మీడియా ద్వారా మాత్రమే విషెస్ చెబుతారా? లేక వ్యక్తిగతంగా వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారా? అనేది సస్పెన్స్‌గా మారింది.