మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.6680 కోట్లు ఆదా! RTC లాభాల్లోకి: భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉచిత బస్సు ప్రయాణాలు 200 కోట్లకు చేరుకున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా RTC పండగ కార్యక్రమాలు నిర్వహించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

“ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, 2023 డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించాం. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 200 కోట్ల ఉచిత మహిళా ప్రయాణాలు జరిగాయి. దీని వల్ల మహిళలు రూ.6680 కోట్లు ఆదా చేసుకున్నారు” అన్నారు.

భట్టి విక్రమార్క మరో కీలక విషయాన్ని గుర్తు చేశారు.

మహిళల ఉచిత ప్రయాణ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం RTCకి చెల్లిస్తోందని, ఇప్పటివరకు రూ.6680 కోట్లు RTCకి అందించామని తెలిపారు.

ఈ పథకం కారణంగా RTC నష్టాల్లో కాకుండా లాభాల్లోకి వచ్చిందని, కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత RTC 2400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని వివరించారు.

ఎలక్ట్రిక్ బస్సులపై ఫోకస్
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చే దిశగా RTC కీలక చర్యలు తీసుకుంటోందని భట్టి పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న 2800 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని నిర్ణయించామని,

ఇప్పటికే 3000 ఎలక్ట్రిక్ RTC బస్సులకు ఆర్డర్లు ఇచ్చి, అందులో 11% బస్సులు వచ్చాయని తెలిపారు.

మహిళల కోసం RTC యాజమాన్యం
మహిళలకు కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా, RTC బస్సులకు మహిళలను యజమానులుగా కూడా చేశామని భట్టి గుర్తుచేశారు.

ఇటీవల 150 మహిళా సంఘాల RTC బస్సు యజమానులకు కోటి రూపాయల చెక్కులు అందించామని చెప్పారు.

Leave a Reply