సూర్యాపేటలో కల్తీ మద్యం ముఠా గుట్టురట్టు.. భారీగా స్పిరిట్, నకిలీ సీల్స్ స్వాధీనం

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సోమవారం భారీ దాడి చేసింది. హుజూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, కల్తీ మద్యం తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం రామాపురంలోని తోట శివ శంకర్, నూకల సూర్యప్రకాశ్ ఇళ్లు, రైస్‌మిల్ సమీపంలోని షెడ్లను తనిఖీ చేసింది. మేళ్లచెరువు, వేపల మాదారం, రామాపురం గ్రామాల్లో జరుగుతున్న దందా స్థాయిని చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.

వీరు తయారు చేసిన కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా రేపల్లెలో పట్టుబడటంతో తీగలాగితే డొంక కదిలినట్లు, అసలు కేంద్రం మేళ్లచెరువులో ఉన్నట్టు తేలింది. అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. రామాపురం గ్రామంలోని నూకల ప్రకాష్‌కు చెందిన రైస్‌మిల్‌లో భారీగా కల్తీ మద్యం నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.

దాడుల్లో 832 లీటర్ల స్పిరిట్, 326 లీటర్ల మద్యం నింపిన 38 కాటన్ల విస్కీ బాటిళ్లు, నకిలీ లేబుళ్లు, ఎక్సైజ్ సీల్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో సూర్యప్రకాశ్, ఆంధ్రప్రదేశ్ దుర్గికి చెందిన శ్రీరాం మహేష్‌లను అరెస్టు చేశారు. వీరికి స్పిరిట్, నకిలీ లేబుళ్లు సరఫరా చేసిన రూతుల శ్రీనివాస్ (హైదరాబాద్), శివ చరణ్ సింగ్ (కృష్ణా ఫార్మా)లపై కూడా కేసులు నమోదు చేశారు.

వేపల మాదారం గ్రామంలోని లొడంగి నవీన్ ఇంట్లోనూ, మేళ్లచెరువులో నాగరాజు అనే వ్యక్తి వద్దనూ కల్తీ మద్యం స్వాధీనం చేశారు. ఈ ముగ్గురు కూడా వివిధ మద్యం దుకాణాల్లో పని చేసిన అనుభవంతో ఈ దందా చేపట్టినట్టు తేలింది. కల్తీ మద్యం తో పాటు ఏపీ 07 డిజెడ్ 6789 నంబర్ కారు కూడా స్వాధీనం చేశారు. హుజూర్‌నగర్‌తో పాటు కోదాడ నియోజకవర్గంలో మరిన్ని కేంద్రాలు ఉన్నట్టు సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు.

Leave a Reply