హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. వాళ్లకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సూచించిన సైబరాబాద్‌ పోలీసులు!

హైదరాబాద్‌లో వర్షం పడితే నగర పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వర్షం కురిసినా రోడ్లు, కాలనీలు చెరువుల్లా మారిపోతాయి. ట్రాఫిక్‌ విషయంలో అయితే చెప్పనవసరం లేదు.. వర్షం కురిస్తే కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే వాహనదారులు చిక్కుకుపోతారు.

ఇక మంగళవారం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సైబరాబాద్‌ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌ వంటి ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలోని ఐటీ కంపెనీలకు పోలీసులు సూచనలు జారీ చేశారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఐటీ కంపెనీ యాజమాన్యాలు ఈ విషయంలో సహకరించాలని కోరారు. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీసులు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఒక పోస్ట్‌ చేశారు.

అంతేకాకుండా నగరంలోని వాహనదారులకు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం వేళల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఆ సమయంలో ప్రయాణం చేయకుండా ఉండాలని సూచించారు. అలాగే తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply