నటుడు సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలు, ఉదారమైన స్వభావంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల కిడ్నీ సమస్యల కారణంగా కన్నుమూసిన కమెడియన్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. స్వయంగా ఫోన్ చేసి, వెంకట్ భార్యను పరామర్శించి ఆర్ధికంగా కూడా సహాయం అందించారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా రూ. లక్ష సాయం అందించారు. భవిష్యత్తులో కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన, ఇండియాకు వచ్చిన వెంటనే ఫ్యామిలీని కలుసుకుంటానని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఫిష్ వెంకట్ కన్నుమూసిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు టాలీవుడ్ నుంచి ఏ హీరో, డైరెక్టర్ లేదా నిర్మాతలు వెళ్ళకపోవడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. చివరిచూపునకు కూడా ఆయన దగ్గరకు వెళ్లకపోవడం బాధాకరం అని సోషల్ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ కుటుంబానికి అండగా నిలిచిన చర్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఫిష్ వెంకట్ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉండగా, చికిత్సకు రూ. 50 లక్షల ఖర్చు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబం నెల రోజుల పాటు సహాయం కోసం ఎదురు చూసింది. టాలీవుడ్ నుండి గబ్బర్ సింగ్ గ్యాంగ్, హీరో విశ్వక్ సేన్ సహా పలువురు సహాయం చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రెండు లక్షల వరకు సాయం అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో జులై 18న ఫిష్ వెంకట్ కన్నుమూశారు.