Bandi Sanjay Vs Eatala Rajender: బండి, ఈటల వ్యవహారంపై బీజేపీ అధిష్టానం సీరియస్..!

బీజేపీలో ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజాగా శనివారం శామీర్‌పేటలో తన నివాసానికి వచ్చిన హుజూరాబాద్ బీజేపీ అసంతృప్త నేతలను ఉద్దేశించి ఈటల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరి మధ్య విభేదాలపై అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. ఇప్పటికే ఇద్దరికీ నోరు జారవద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర హోమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును ఢిల్లీకి పిలిపించారు.

రాంచందర్ రావు బండి, ఈటల కామెంట్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన ఇప్పటికే చర్చలు జరిపారు. అధిష్టానం సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈటల రాజేందర్ బండిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. “అసలు నువ్వెవరు, నీ శక్తి ఎంత, నేను 2002లో జిల్లాకు వచ్చాను, మంత్రిగా పనిచేశాను, అడుగుపెట్టని గ్రామం లేదు, ఖబర్దార్ బిడ్డా” అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా సైకోగాడు, చిల్లరగాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటలకు అవకాశం రాకుండా సంజయ్ అడ్డుకున్నాడని ఈటల వర్గం భావిస్తోంది. ఈ కారణంగానే ఈటల రాజేందర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. నిజానికి ఇద్దరి మధ్య విభేదాలు చాలా కాలం నుంచే ఉన్నాయని, ఇప్పుడు అవి మరింత ముదిరాయని ప్రచారం సాగుతోంది. దీనిపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది.

Leave a Reply