పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి హైదరాబాద్ పోలీసుల షాక్.. HHVM ప్రీ రిలీజ్ ఫంక్షన్‌పై కీలక నిర్ణయం..!

‘పుష్ప 2’ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత సినిమా ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు అనుమతి ఇచ్చే విషయంలో తెలంగాణ పోలీసులు ఇప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో భద్రతా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు.

ఇప్పుడు ఆ నియమాలను పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కూ వర్తింపజేశారు. ఈ రోజు హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగనున్న ఈవెంట్‌కు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.

పోలీసులు నిర్వాహకులకు కేవలం వెయ్యి నుంచి 1500 మందికే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ ఇస్తారని తెలిపారు. పాస్‌లు లేకుండా బయట ఉండే అభిమానులను నిర్వాహకులే కంట్రోల్ చేయాలని సూచించారు. ఈవెంట్ మొత్తం భద్రతా బాధ్యత నిర్మాతదేనని పోలీసులు క్లియర్‌గా చెప్పారు.

పవన్ కళ్యాణ్ సినిమా నాలుగేళ్ల తర్వాత రిలీజ్ అవుతుండటంతో అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారని అంచనా. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా తక్కువ మందికే అనుమతి ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు.

ఇటీవలే భద్రతా కారణాల వల్ల ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దయింది. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా ముందుగానే క్యాన్సిల్ చేశారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు.

హరిహర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలో మొదటి భాగం జూలై 24న రిలీజ్ కానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించగా, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు.

ఖుషీ, బంగారం సినిమాల తర్వాత దాదాపు 18 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ – ఏఎం రత్నం కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక చారిత్రాత్మక యోధుడిగా కనిపించబోతున్నారు.

Leave a Reply