గొప్ప మనసు చాటుకున్న అక్షయ్ కుమార్.. నువ్వు దేవుడివి అంటూ నెటిజన్ల ప్రశంసలు

ఇటీవల షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగి ప్రముఖ స్టంట్ మ్యాన్ రాజు గుండెపోటుతో మరణించారు. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య నటిస్తున్న మూవీ సెట్‌లో కారు బోల్తా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటన చిత్రబృందం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని పోలీసులు డైరెక్టర్ పా. రంజిత్‌పై కేసు నమోదు చేశారు. మోహన రాజు మరణవార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారగా, సినీ ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సంఘటన తెలుసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్న దాదాపు 650 మంది స్టంట్ మ్యాన్‌లకు తన సొంత డబ్బుతో ఇన్సూరెన్స్ చేయించారు. ఇందులో ఆరోగ్య బీమా, ప్రమాద బీమా రెండూ ఉన్నాయి.

సెట్‌లో లేదా బయట ఎక్కడైనా గాయపడితే ₹5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో 650 నుండి 700 మంది స్టంట్ మ్యాన్‌లు, యాక్షన్ సిబ్బంది ఈ బీమా పరిధిలో ఉన్నారని సమాచారం.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు అయితే “నువ్వు దేవుడివి స్వామీ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ‘కేసరి చాప్టర్-2’ హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ‘హౌస్‌ఫుల్-5’, ‘కన్నప్ప’ పెద్దగా మెప్పించలేదు. అయినప్పటికీ అక్షయ్ కుమార్ హిట్, ఫ్లాప్‌కి సంబంధం లేకుండా వరుసగా కొత్త ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Leave a Reply