ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయనను గోవా గవర్నర్గా నియమించడంతో, పార్టీ ప్రాథమిక సభ్యత్వం మరియు పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
అశోక్ గజపతిరాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి లేఖ రాశారు. “ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసే అవకాశం రావడం నా అదృష్టం” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. గోవా గవర్నర్ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర
టీడీపీ ఆవిర్భావం నుంచే అశోక్ గజపతిరాజు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయాలు సాధించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు.
2014లో ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గత ఎన్నికల్లో స్వయంగా పోటీకి దిగకుండా, తన కూతురిని బరిలోకి దింపారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు.
ఎన్డీయే సిఫార్సుతో గవర్నర్ అవకాశం
టీడీపీకి ఆయన చేసిన సేవలను గుర్తించి, గవర్నర్ పదవికి సిఫార్సు చేసింది పార్టీ. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో, గవర్నర్ నియామకానికి కేంద్రం కూడా ఆమోదం తెలిపింది.