Ranya Rao: నటి రన్యారావుకు బిగ్ షాక్‌.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఏడాది జైలు శిక్ష!

కన్నడ నటి రన్యారావుకు పెద్ద షాక్‌ తగిలింది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ఆమెకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు కోర్టు తీర్పు ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ మరియు స్మగ్లింగ్‌ కార్యకలాపాల నివారణ బోర్డు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు తరుణ్‌ కొండారు రాజు, సాహిల్‌లకు కూడా సమాన శిక్ష విధించినట్లు బోర్డు వెల్లడించింది. అంతేకాకుండా శిక్షా కాలంలో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ ప్రతి మూడు నెలలకొకసారి కొనసాగుతుందని కోర్టు తెలిపింది.

బెంగళూరు ఎయిర్‌పోర్టులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి..
దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో రెడ్‌హ్యాండెడ్‌గా రన్యారావు పట్టుబడ్డారు. ఆమె నుంచి 14.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.

రన్యారావు కన్నడలో కొన్ని సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఇటీవల చిత్రరంగంలో అవకాశాలు తగ్గడంతో వ్యాపార రంగం, విదేశీ పర్యటనల్లో ఎక్కువగా కనిపించింది. ఈ క్రమంలో స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడింది. కోర్టు తీర్పుతో రన్యారావు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పరిశ్రమలోని పలువురు ఈ ఘటనపై స్పందిస్తూ చట్టానికి ఎవరూ అతీతం కాదని కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply