వరంగల్ నగరంలోని పోస్టాఫీసులకు మహిళలు భారీగా క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘మహాలక్ష్మి పథకం’ కింద ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనుందనే వార్తలతో పాటు, ఆ అమౌంట్ పోస్టాఫీసు ఖాతాల్లోనే జమ చేయనున్నారన్న ప్రచారం గ్రామాల వరకు వ్యాపించింది. ఈ ప్రచారం కారణంగా హనుమకొండ జిల్లా హెడ్ పోస్టాఫీసు సహా వరంగల్ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్న బ్రాంచ్ పోస్టాఫీసులకు మహిళలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉదయం నుంచే లైన్లు కడుతున్నారు. బాలింతలు, వృద్ధులు సైతం గంటల తరబడి లైన్ లో నిలబడి మరీ ఖాతాలు తెరుస్తున్నారు. కొంతమంది అయితే పాస్బుక్లు వెంటనే రావడం లేదని ఆందోళన చెందుతుండగా, మరికొందరు ఏదైనా స్కీమ్ వస్తే ముందుగానే అకౌంట్ ఉంటే మంచిదని భావించి తహతహలాడుతున్నారు. ఇప్పటికే పోస్టాఫీసుల వద్ద కస్టమర్ల రద్దీ పెరగడంతో సిబ్బంది కూడా అదనంగా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది.
అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని పోస్టాఫీసు అధికారులు స్పష్టం చేశారు. మహిళలు వచ్చినందుకు తిరస్కరించడం లేదని, కావాలనుకునేవారికి కొత్త అకౌంట్లు ఇస్తున్నామని మాత్రమే తెలిపారు. నిజంగా ఈ పథకం పోస్టాఫీసు ఖాతాల్లోనే జమ అవుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ, పథకం లబ్ధి పొందాలన్న ఆశతో పెద్దఎత్తున ఖాతాలు తెరవడం హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో చర్చనీయాంశంగా మారింది.