ENG vs IND : లార్డ్స్ టెస్టులో భారత్‌పై గెలిచిన ఇంగ్లాండ్‌కు ఐసీసీ భారీ షాక్

లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉత్సాహంగా ఉన్న ఇంగ్లాండ్‌కు తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లను తగ్గించడమే కాకుండా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ కోత విధించింది.

లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో ఐసీసీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అంతేకాదు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో ఇంగ్లాండ్ జట్టు నుంచి రెండు పాయింట్లను కూడా తగ్గించింది. ఈ పెనాల్టీతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ పాయింట్లు 24 నుంచి 22కి పడిపోయాయి.

ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్క ఓవర్ తక్కువగా వేస్తే 5 శాతం జరిమానా పడుతుంది. ఈ లెక్కన రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో 10 శాతం ఫైన్ విధించారు. చేసిన తప్పిదాన్ని అంగీకరించడంతో పాటు శిక్షను జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంగీకరించడంతో దీనిపై ఇక ఎలాంటి విచారణ ఉండదని ఐసీసీ స్పష్టం చేసింది.

ఈ పెనాల్టీతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో ఇంగ్లాండ్ స్థానంలో మార్పు చోటు చేసుకుంది. శ్రీలంక రెండో స్థానానికి చేరుకోగా, ఇంగ్లాండ్ మూడో స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తుండగా, భారత్ ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.

Leave a Reply