మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం రూపొందుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి అసలు పేరు ‘శంకరవరప్రసాద్’ కావడంతో అభిమానుల్లో ఈ టైటిల్ పట్ల ఆసక్తి నెలకొంది.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న సినిమాకు సంబంధించి టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరీన్ ట్రెసా మరో కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం.
ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తారని టాక్. ఒక పాత్రలో స్కూల్ డ్రిల్ మాస్టర్ శివశంకర వరప్రసాద్ పాత్రలో ఆయన కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రకు ప్రత్యేకమైన లుక్, డిక్షన్, బాడీ లాంగ్వేజ్‌తో మెగాస్టార్ కనిపించబోతున్నట్లు చిత్రబృందం భావిస్తోంది.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఈ చిత్రం 70% వరకు ఫ్యామిలీ కామెడీతో, మిగతా భాగం ఎమోషనల్ డ్రామాతో నడవనుందని చెప్పారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్’ అనే టైటిల్ చర్చల్లో ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.