Jaspreet Bumrah: లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ రికార్డు బద్దలు!

ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 23 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్ వోక్స్‌ వంటి స్టార్ ప్లేయర్లను వెనక్కు పంపుతూ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుదిపేశాడు.

ఈ ప్రదర్శనతో బుమ్రా టెస్ట్ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశీ గడ్డపై అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు చేసిన భారత బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు విదేశాల్లో 13 సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా, 12 సార్లు ఈ ఘనత సాధించిన దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌ను అధిగమించాడు.

ఈ జాబితాలో ఇషాంత్ శర్మ (9), జహీర్ ఖాన్ (8), ఇర్ఫాన్ పఠాన్ (7) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

సేనా దేశాల్లో బుమ్రా అరుదైన ఘనత
బుమ్రా తన టెస్ట్ వికెట్లతో సేనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ లెజెండ్ వసీం అక్రమ్ (146 వికెట్లు) రికార్డును అధిగమించడం విశేషం.

టెస్ట్ కెరీర్‌లో బుమ్రా ఘనతలు
బుమ్రా టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 15 సార్లు ఐదు వికెట్లు తీసాడు.

35 టెస్టుల్లోనే 13 సార్లు విదేశాల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం గొప్ప విషయం.

విదేశాల్లో అత్యధిక ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లు:
13 – జస్ప్రీత్ బుమ్రా (35 టెస్టులు*)

12 – కపిల్ దేవ్ (66 టెస్టులు)

9 – ఇషాంత్ శర్మ (63 టెస్టులు)

8 – జహీర్ ఖాన్ (54 టెస్టులు)

7 – ఇర్ఫాన్ పఠాన్ (15 టెస్టులు)

బుమ్రా చేసిన ఈ అద్భుత ప్రదర్శన భారత బౌలింగ్ చరిత్రలో మరొక మైలురాయిగా నిలిచింది.

Leave a Reply