Toddy Adulteration: కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం.. 5కి చేరిన మృతుల సంఖ్య..!

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో 31 మంది నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అత్యంత తీవ్రంగా స్పందించాయి.

ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఇప్పటివరకు బాలానగర్‌లో 5, కూకట్‌పల్లి మరియు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లలో 3 కేసులు నమోదయ్యాయి.

ఎక్సైజ్‌ అధికారులు మొత్తం ఐదు కల్లు కాంపౌండ్ల నుంచి శాంపిళ్లను సేకరించి, నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్‌కు పంపించారు. ఇంద్రానగర్‌లో ఉన్న ఓ కల్లు దుకాణం నుంచి 66 గ్రాముల తెలుపు రంగు పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. నిపుణుల అనుమానం ప్రకారం, కల్లులో నెఫ్రో టాక్సిక్స్ కలపడం వల్లే మరణాలు సంభవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

కస్టమర్లను ఆకట్టుకునేందుకు, మత్తును పెంచేందుకు కల్లు కాంపౌండ్ నిర్వాహకులు క్లోరల్ హైడ్రేట్, అల్ప్రాజోలాం, డైజోఫామ్, అమ్మోనియం వంటి రసాయనాలు కలుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇవి తాగినవారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఈ కల్తీ కల్లు తాగినవారికి మత్తుతో పాటు నరాలు, మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి కీలక అవయవాల పనితీరు దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మొదట్లో వాంతులు, స్పృహ కోల్పోవడం, కోమా లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

కంటి చూపులో మార్పులు, ఫిట్స్, మానసిక స్థితిలో అస్థిరత, ఆగిపోని మత్తు వంటి దుష్ఫలితాలు కనిపిస్తాయి.

కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే డయాలసిస్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటనతో కల్లు ప్రియుల్లో భయం నెలకొంది. కల్తీ కల్లు కట్టడికి పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు అటువంటి కల్లు దుకాణాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply