Thammudu Collections: నితిన్‌కు మరో షాక్! రూ.75 కోట్ల ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద బోల్తా..?

నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4, 2025న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు రూ. 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. వరుస ఫ్లాపుల మధ్య ‘తమ్ముడు’తో తిరిగి రాణించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టిన నితిన్‌కు, మళ్లీ నిరాశే ఎదురైంది.

విడుదలైన నాలుగు రోజుల్లో ‘తమ్ముడు’ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 3.21 కోట్లు నెట్ కలెక్షన్లు (రూ. 6.20 కోట్లు గ్రాస్‌) మాత్రమే రాబట్టిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది నితిన్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆయన గత చిత్రం ‘రాబిన్ హుడ్’ రూ. 4.8 కోట్లు వసూలు చేయగా, ‘తమ్ముడు’ ఆ మార్క్‌ను కూడా దాటలేకపోయింది.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రూ. 22.5 కోట్లు వసూలు కావాలి. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తే అది అసాధ్యం అనిపిస్తోంది. దీంతో ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే ఒక పెద్ద డిజాస్టర్‌గా మిగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆడియో, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ ద్వారా కొంతమేరకు పెట్టుబడిని రికవర్ చేయాలన్న ప్రయత్నంలో నిర్మాతలు ఉన్నప్పటికీ, థియేట్రికల్ పరంగా మాత్రం భారీ నష్టాలు తప్పవని అంచనా. ముఖ్యంగా, ‘తమ్ముడు’ నితిన్‌కు వరుసగా నాలుగో ఫ్లాప్ కావడం గమనార్హం.

అక్కాచెల్లెలు – తమ్ముళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా, కథ పాయింట్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ, స్క్రీన్ ఎక్సిక్యూషన్ లోనే సినిమా పూర్తిగా తడబడినట్టు కనిపిస్తోంది. దీంతో నితిన్ నెక్స్ట్ సినిమా ‘యెల్లమ్మ’ విజయమే ఆయన కెరీర్‌లో కమ్‌బ్యాక్‌కు కీలకంగా మారనుంది.

Leave a Reply