Yash Dayal: ఆర్సీబీ బౌలర్‌ యశ్‌ దయాల్‌పై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్‌ యశ్‌ దయాల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి అతనిపై లైంగిక వేధింపులు, దోపిడీ, వంచన ఆరోపణలతో సీఎం గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, భారతీయ న్యాయసంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు.

సదరు యువతి చెప్పిన వివరాల ప్రకారం, ఆమె గత ఐదేళ్లుగా యశ్‌ దయాల్‌తో సంబంధం కొనసాగించిందని తెలిపింది. “తనకు కాబోయే కోడలు అంటూ తన కుటుంబంలో పరిచయం చేశాడు. కానీ ఆ తర్వాత అతనికి ఇతర యువతులతో సంబంధాలున్నట్లు తెలిసింది” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించాడని ఆరోపించింది.

ఆ యువతి చెప్పిన ప్రకారం, ఒక దశలో ఆమె మహిళా హెల్ప్‌లైన్ 181కి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా, పోలీసులు స్పందించలేదని ఆరోపించింది. చివరికి సీఎం గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా న్యాయం కోరిందని వెల్లడించింది. తన వద్ద ఫొటోలు, చాటింగ్‌లు, వీడియో కాల్ రికార్డింగ్స్, ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నాయని, ఇవన్నీ విచారణలో ఉపయోగపడతాయని చెప్పింది.

గతంలో కూడా ఆమె యశ్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్రాథమికంగా విచారించిన పోలీసులు ఇప్పుడు పూర్తి ఆధారాలు పరిశీలించి కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఈ కేసు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. యశ్ దయాల్ నుంచి స్పందన ఇంకా రాలేదు. అధికారికంగా ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Leave a Reply