గోల్డెన్ వీసా అంటేనే కోట్లాధిపతుల కోసం అని చాలామందికి అనిపిస్తుంది. అమెరికా, యూకే లాంటి దేశాల్లో గోల్డెన్ వీసా పొందాలంటే కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి, ట్రంప్ హయాంలో ప్రవేశపెట్టిన అమెరికా గోల్డెన్ వీసా పొందాలంటే కనీసం 5 మిలియన్ల డాలర్లు పెట్టుబడి అవసరం. కానీ ఇప్పుడు అదే గోల్డెన్ వీసాను యూఏఈ (UAE) కేవలం రూ.23 లక్షలకే అందించనున్నట్టు సమాచారం. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌక గోల్డెన్ వీసాగా గుర్తింపు పొందనుంది.
రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు.. యూఏఈ గోల్డెన్ వీసా మీ సొంతం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గోల్డెన్ వీసాల విధానం కొత్తది కాదు. భారత్‌లోని పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇప్పటికే ఈ వీసా కలిగి ఉన్నారు. కానీ తాజాగా యూఏఈ ప్రభుత్వం ఒక కొత్త గోల్డెన్ వీసా మోడల్‌ను ప్రవేశపెట్టింది, అది నామినేషన్ ఆధారిత వీసా.
ఇప్పటి వరకు గోల్డెన్ వీసా కోసం దాదాపు AED 20 లక్షలు (రూ. 4.66 కోట్లు) పెట్టుబడి అవసరం ఉండేది. కానీ ఈ కొత్త నామినేషన్ స్కీమ్ ద్వారా కేవలం AED 1 లక్ష (రూ. 23 లక్షలు) చెల్లిస్తే చాలు, జీవితకాల గోల్డెన్ వీసా లభించనుంది.
నామినేషన్ ఆధారిత స్కీమ్‌లో కీలక విషయాలు:
మొదటగా భారతదేశం, బంగ్లాదేశ్ పౌరులకు ఈ అవకాశం.
ఇండియాలో ఈ సేవల కోసం రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని నియమించారు.
రియాద్ కార్యాలయాలు, ఆన్‌లైన్ పోర్టల్, వన్ వాస్కో కేంద్రాలు, కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
వీసా వచ్చినవారు:
కుటుంబ సభ్యులను యూఏఈకి తీసుకెళ్లొచ్చు
వ్యక్తిగత డ్రైవర్, హెల్పర్లను నియమించుకోవచ్చు
యూఏఈలో ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకోవచ్చు
ఈ గోల్డెన్ వీసా జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది
భారతీయులకు సువర్ణావకాశం
ఇప్పటికే అమెరికా, యూకే వలసలకు భారీ ఖర్చు అవుతోన్న తరుణంలో, యూఏఈ గోల్డెన్ వీసా రూ.23 లక్షలకే లభించడమంటే మధ్యతరగతి వలసదారులకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది. త్వరలోనే ఈ స్కీమ్‌ను ఇతర దేశాలకు విస్తరించనున్నారు.