Ramchander Rao: అలాంటి వాళ్లు పార్టీకి అవసరం లేదు.. బీజేపీ కొత్త చీఫ్ రామచందర్ రావు వార్నింగ్..!

తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం రాగా, ప్రారంభం నుంచే కఠిన సిగ్నల్స్‌ వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్ రావు, పార్టీ నాయకులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు – బీజేపీ విధానాలు నచ్చని వారికి ఇక్కడ స్థానం లేదని హెచ్చరించారు.

శనివారం కిషన్ రెడ్డి నుంచి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను స్వీకరించిన రామచందర్ రావు, పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తనకు గొప్ప అవకాశాన్ని కల్పించిందని, రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తానన్నారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఉద్దేశించాయన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఇటీవల రాజాసింగ్‌ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించినట్టుగా, “పార్టీ విధానాలు నచ్చక ఎవరైనా వెళ్లిపోతే బీజేపీకి నష్టం లేదు. నమ్మకంగా ఉన్నవారిని మేమెప్పుడూ వదలం, ఎవరైనా చిత్తశుద్ధితో పని చేస్తే వారికి పార్టీ తప్పకుండా గుర్తింపు ఇస్తుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు.

అంతకుముందు చార్మినార్‌లో భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రామచందర్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రం పంపిన యూరియాను రైతులకు ఇవ్వకుండా, రైతులను మోసం చేస్తోంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply