Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం.. కలిసిన ఉద్ధవ్ – రాజ్ ఠాక్రే..!

“కలవడానికి కాదు.. కలిసే ఉండేందుకు వచ్చాం” – ఉద్ధవ్, రాజ్ ఠాక్రే కీలక ప్రకటన

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత అన్నదమ్ములైన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కలుసుకోవడం సంచలనంగా మారింది. ముంబైలో జరిగిన వాయిస్ ఆఫ్ మరాఠా కార్యక్రమం ద్వారా వీరిద్దరూ మళ్లీ కలిసి రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని మొదలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ ఈవెంట్‌కి కారణం మహారాష్ట్ర కేబినెట్ తీసుకున్న త్రిభాషా విధానం ఉపసంహరణ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విజయంగా ప్రకటించాయి. ఈ సందర్భంగానే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

బాల్ ఠాక్రే చేయలేనిది ఫడ్నవిస్ చేశారు: రాజ్ ఠాక్రే
రాజ్ ఠాక్రే వ్యాఖ్యల్లో ఆసక్తికరమైన పాయింట్ ఒకటి ఉంది.. ‘‘మమ్మల్ని కలిపే పని ఎవరూ చేయలేకపోయారు.. బాల్ ఠాక్రే గారు కూడా కాదు.. కానీ ఫడ్నవిస్ తీసుకున్న నిర్ణయం మాత్రం మమ్మల్ని కలిపేసింది’’ అని అన్నారు. ఇకపై రాష్ట్ర అభిమానం, భాషా గౌరవం విషయంలో తాము ఒకటిగా ఉంటామని స్పష్టం చేశారు.

కేంద్రంపై విమర్శలు
ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే కేంద్రంపై కూడా ఘాటుగా స్పందించారు. ఇంగ్లీష్ మీడియం చదివితే పిల్లలు భాషా విలువలు కోల్పోతారని చెబుతుండడం సరైంది కాదని, దక్షిణ భారతదేశానికి చెందిన నేతలు, నటులు ఇంగ్లీష్ మీడియంలో చదివినా తమ మాతృభాషల పట్ల గౌరవం చూపుతున్నారని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు కూడా తమ భాషపై గర్వించగలగాలని అన్నారు.

‘‘మా పూర్వీకులు మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించినా, ఎక్కడా మరాఠీని రుద్దలేదు. అయితే కేంద్రం మాత్రం త్రిభాషా విధానాన్ని బలవంతంగా అమలు చేయాలని చూస్తోంది. ఇది హేతుబద్ధమైన పద్ధతి కాదు. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇప్పటికీ ఆంగ్ల భాషలో ఉత్తర్వులు ఇస్తున్నప్పుడు.. మహారాష్ట్రపై తప్పని సరిగా హిందీని రుద్దడం ఎంత వరకు సమంజసం?’’ అంటూ ప్రశ్నించారు.

Leave a Reply