తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ఉధృతంగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘‘సవాల్ స్వీకరిస్తున్నా.. 8వ తేదీన చర్చ పెట్టుకుందాం. తెలంగాణలో ఎవరు ఏం చేశారో ప్రజలు ముందే తెలుసుకుంటారు’’ అంటూ ఘాటుగా స్పందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలు ఇలా:
‘‘రైతులకు మేం చేసిన పనులు, మీరు చేసిన మోసాలు – ప్రజలంతా గమనిస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన నాయకుడు కేసీఆర్. కానీ చేతకాని పాలనతో రైతులను పిండి పిండి చేసేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్‌కు దమ్ముంటే, జూలై 8వ తేదీన ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రా, చర్చిద్దాం. 72 గంటల సమయం ఇస్తున్నా, ప్రిపేర్ అవ్వడానికి. చర్చ ఎక్కడైనా సరే – కొండారెడ్డిపల్లి, కొడంగల్, చింతమడక అయినా నేను రెడీ’’ అన్నారు కేటీఆర్.
8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కి మేము చర్చకు వస్తాము.. రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా – కేటీఆర్ https://t.co/lxnqpKwGpO pic.twitter.com/A9tGfH7Of4
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2025
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే:
శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన “సామాజిక న్యాయ సమరభేరి” సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ –
‘‘తెలంగాణలో 70% మంది రైతులు. వారికోసం రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, బోనస్ వంటి పథకాల ద్వారా రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చాం. దీనిపై చర్చకు సిద్ధం. కేసీఆర్, కేటీఆర్, మోదీ ఎవరు వస్తారో రండి’’ అంటూ సవాల్ విసిరారు.
దానికి కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ:
‘‘కేసీఆర్‌ను ఎదిరించలేని నీకు మేమే చాలు. రా, చర్చిద్దాం. రైతుల కోసం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు, బీమా, నీటి ప్రాజెక్టులు – అన్నీ విప్లవాత్మకంగా మారాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 39 వేల కోట్ల రైతుబంధు నిధులు ఎగ్గొట్టింది. పలు హామీలను అమలు చేయకుండా రెచ్చిపోయే మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో నీ నీటి రాజకీయాలు తెలిసినవే. ప్రజలు బాగా గుర్తుంచుకుని ఉన్నారు’’ అన్నారు కేటీఆర్.