కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణకు 50కి పైగా కేంద్ర సంస్థలు వచ్చాయని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ చెబుతున్నవి అన్ని అబద్ధాలేనని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన “సామాజిక న్యాయ సమర భేరి” సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయం కార్యకర్తల కృషి ఫలమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల కృషిని ప్రశంసించారు. కేసీఆర్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు యత్నించారని, కానీ ప్రజలు వారికే గుణపాఠం చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించారని పేర్కొన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న కుల గణన దేశానికి రోల్ మోడల్ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యాయని.. సన్నబియ్యం, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ పథకాలపై వివరించారు. బీసీ రిజర్వేషన్ల అమలు వరకు పోరాటం కొనసాగుతుందని ఖర్గే స్పష్టం చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు దేశానికి ఏం చేశారన్న దానిపై ప్రశ్నలు సంధించారు. నెహ్రూ, ఇందిరా హయాంలో దేశ అభివృద్ధి ఎలా జరిగింది అనే విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను రెండుగా విడగొట్టిన నేత ఇందిరాగాంధీ అయితే బెదరలేదని, ఇప్పటి నేతలు మాత్రం మాటల యుద్ధాలు మాత్రమే చేస్తారని విమర్శించారు.
42 దేశాల్లో పర్యటించిన మోదీ, భారత్‌లోని మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికలకే శ్రద్ధ పెడుతున్నారే తప్ప, దేశ భద్రతపై పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారు.. అలాంటివాళ్లు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో ఉన్నారా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
‘‘ధైర్యం ఉంటే రాజ్యాంగంలోని Secular, Socialist అనే పదాలు తీసేయండి’’ అంటూ బీజేపీకి సవాల్ విసిరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.