Nipah: కేరళలో నిఫా వైరస్ కలకలం.. మూడు జిల్లాలకు హెచ్చరికలు జారీ..!

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా రెండు కొత్త కేసులు వెలుగుచూశాయి. మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదవ్వగా, ముందు జాగ్రత్తగా కోజికోడ్‌ సహా మూడు జిల్లాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మలప్పురం, కోజికోడ్ మెడికల్ కాలేజీల్లో బాధితుల శాంపిల్స్‌ను పరీక్షించగా ప్రాథమికంగా నిఫా వైరస్‌గా నిర్ధారించారు. తుది నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు తెలిపారు.

అధికారిక ఫలితాలు రాకముందే కేరళ ప్రభుత్వం అప్రమత్తమై నివారణ చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 కమిటీలను ఏర్పాటుచేసి కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్‌మెంట్ ప్లానింగ్, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించారు. ఈ మూడు జిల్లాల్లో ఆంక్షలు అమలు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించారు.

అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. అవసరమైతే కంటైన్మెంట్ జోన్లు ప్రకటించేందుకు కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తి అడ్డుకునేందుకు ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

Leave a Reply