Delhi: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. లైఫ్ టైం ముగిసిన వాహనాలపై బ్యాన్‌ ఉపసంహరణ

లైఫ్ టైం ముగిసిన వాహనాలకు ఇంధనం అందించకూడదన్న నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఇంధన నిషేధ ఉత్తర్వులను అధికారికంగా వెనక్కి తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంక్‌ల వద్ద ఇంధనం అందించరాదని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం దేశ రాజధానిలోని 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, 100 ప్రత్యేక బృందాలను రవాణా శాఖ నియమించింది.

ఈ నిషేధాన్ని నవంబర్ 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్, సోనిపట్ లాంటి పరిసర ప్రాంతాలకు విస్తరించాలన్న ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. తర్వాతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎన్‌సీఆర్‌లోని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు కూడా తెలియజేశారు.

అయితే, వాహనదారులు, ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు పెద్ద ఎత్తున ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ఢిల్లీ ప్రభుత్వం ఇంధన బ్యాన్‌ చర్యలు తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. వాహన వయస్సు ఆధారంగా స్క్రాప్ చేయడం సాధ్యం కాదని, బదులుగా కాలుష్య కారక వాహనాలను మాత్రమే స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత పెరగడంతో, ఇంధన నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. తద్వారా వాహనదారులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.

Leave a Reply