‘నన్ను డమ్మీ అన్నవాళ్లకు డాడీ అవుతా’.. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హెచ్చరిక!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గురువారం ఓ ప్రైవేట్ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే కీరీటంలా కాదు.. ఇది పెద్ద బాధ్యత. నన్ను డమ్మీ లీడర్ అనేవాళ్లకు డాడీ అనిపించేలా చేస్తాను. తెలంగాణలో నాకంటే ఫైర్ బ్రాండ్ ఎవ్వరూ లేరు” అంటూ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌పై స్పందించిన రాంచందర్ రావు – “ఆ పార్టీ ఇప్పుడు ట్విట్టర్ పార్టీ అయిపోయింది. వాళ్లతో కాదు.. మా అసలైన పోటీ కాంగ్రెస్‌తోనే” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిగా ఫోకస్ చేశామని, ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

రాజా సింగ్ అంశం జాతీయ నాయకత్వం పరిధిలో ఉందని, దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ.. “ఇప్పటివరకు 14 సార్లు జైలుకు వెళ్లాను. లాఠీదెబ్బలు తిన్నాను. మావోయిస్టులతో పోరాటాలు చేశాను. కానీ నేను కూల్‌గా ఉండడాన్ని ఎవరూ డమ్మీ అనుకోవద్దు. నా ఉగ్రరూపం చూస్తే తట్టుకోలేరు. బూతులు మాట్లాడితేనే లీడర్ కాడు. తను నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లగలిగినవాడే అసలైన నాయకుడు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామంటూ ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply