Sigachi Blast: సిగాచీ ప్రమాదం: ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు.. 43 మంది మృతి..!

పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు 43 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, కాగా ఇంకా పలువురు గల్లంతై ఉండటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం వర్షంతో ఆపివేసిన రికవరీ ప్రయత్నాలు, ఈరోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి.

ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదస్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ. కోటి పరిహారం ప్రకటించారు. సంస్థ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించిందని ఆరోపించిన సీఎం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.

ఇకపోతే పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. ఎఫ్ఐఆర్ లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాత మిషనరీలను తక్షణం మార్చాలని పలుమార్లు చెప్పినా కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదని, సాయి యశ్వంత్ అనే ఉద్యోగి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రమాదానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని, ఉద్యోగుల మరణాలకు వారు బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాదు, ఈ ప్రమాదంపై రాజకీయంగా కూడా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన వారు, బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలం కనిపెట్టలేని విధంగా ధ్వంసమైందని, మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పరిశ్రమ యాజమాన్యం తొలిసారి ఘటనాస్థలానికి వచ్చినట్లు సమాచారం. మొత్తం ఘటనపై సమగ్ర విచారణతోపాటు నేరపూరిత నిర్లక్ష్యం విషయంలో కేసు మరో దశలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply