BV. Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్ట్‌, మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ (75) గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, హిప్నాటిజం, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివి.

డాక్టర్ పట్టాభిరామ్ తన ‘ప్రశాంతి కౌన్సెలింగ్ సెంటర్’ ద్వారా వేలాది మంది మానసిక రోగులకు సేవలందించారు. ఆయన రచించిన పుస్తకాలు, బోధనలతో ఎంతోమందికి జీవిత మార్గాన్ని చూపారు. ఆత్మహత్య ఆలోచనలు, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఆయన మానసికంగా అండగా నిలిచారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ శిక్షణా శిబిరాలు నిర్వహించి యువతలో ఆత్మవిశ్వాసం నింపారు. హిప్నాటిజం, మెమరీ టెక్నిక్స్‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌ వంటి అంశాల్లో అనేక మంది విద్యార్థులకు మార్గదర్శకుడయ్యారు.

ప్రముఖుల స్పందనలు:

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ‘బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మృతి బాధాకరం. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చిన మార్గదర్శనం ఎంతో మందికి మార్గసూచిగా నిలిచింది. ఆయన మృతి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’

ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. ‘ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మెజీషియన్‌గా బీవీ పట్టాభిరామ్ అందించిన సేవలు అమోఘం. హిప్నాటిస్టుగా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా ఆయన పాత్ర మరువలేనిది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’

Leave a Reply