Pawan Kalyan: ఆర్థిక ఇబ్బందుల్లో నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ సాయం..

టాలీవుడ్‌లో ‘పాకీజా’ పాత్రతో గుర్తింపు పొందిన నటి వాసుకి అలియాస్ పాకీజా ఇటీవల తన ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ సహాయం కోరిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె ఆర్థిక ఇబ్బందులకు చలించిపోయిన పవన్, రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించారు.

తమిళ సినీ పరిశ్రమ గుర్తించకపోవడంతో, ప్రస్తుతం ఏపీకి వచ్చి రాజకీయ నాయకుల సాయాన్ని కోరిన పాకీజా, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘పూట గడవడం కోసం బిక్షాటన స్థితి దాకా వచ్చాను’ అంటూ కన్నీరు గార్చారు. తల్లి వైద్యం కోసం ఖర్చుచేశానని.. దాంతో ఆర్థికంగా పూర్తిగా క్షీణించానని, తీవ్ర వేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ద్వారా ఆమెకు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ విప్ పి.హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలిసి పాకీజాకు రూ.2 లక్షల చెక్ అందజేశారు.

ఈ సహాయానికి పాకీజా భావోద్వేగంతో స్పందిస్తూ, ‘పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎదురుగా ఉంటే ఆయన కాళ్లు మొక్కుతాను’ అని అన్నారు. నిన్నే తన సమస్యను జనసేన కార్యాలయానికి తెలియజేశానని, వెంటనే స్పందించి ఆదరించారని చెప్పారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply