డీఎస్సీ 2025 పరీక్షలు రాయనున్న అభ్యర్థులకి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన ఈ నియామక పరీక్షలు, యోగా దినోత్సవం కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలను జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు తమ కొత్త హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ apdsc.apcfss.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షా తేదీలు, కేంద్రాల్లో మార్పులు జరిగి ఉండటంతో పాత హాల్ టికెట్లు చెల్లవని స్పష్టం చేశారు. అందువల్ల ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా తాజా హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రాలు:
ఈసారి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ డీఎస్సీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు:
ఉదయం సెషన్: 9:30 AM – 12:00 PM
మధ్యాహ్నం సెషన్: 2:30 PM – 5:00 PM
ప్రాథమిక కీ విడుదల తేదీ:
పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) రూపంలో జరుగుతాయి. చివరి పరీక్ష ముగిసిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తారు. దానిపై అభ్యంతరాల కోసం 7 రోజుల గడువు ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన తర్వాత మరో 7 రోజుల్లో ఫైనల్ కీ విడుదల చేసి, ఆ తర్వాత 7 రోజుల్లో ఫలితాలు ప్రకటించనున్నారు.