క్లాసిక్ లవ్ స్టోరీలు, కుటుంబ ఎమోషన్స్‌లో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల, అనామిక తర్వాత మళ్లీ థ్రిల్లర్ జానర్లోకి అడుగుపెట్టి ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాణంలో రూపొందింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న పాన్ ఇండియా రిలీజ్ అయ్యింది.
కథ:
దేశం మొత్తానికి సరిపడే ఆయిల్ నిధి బంగాళాఖాతంలో కనిపిస్తే, దాన్ని ప్రైవేటు ప్రాజెక్టుగా మార్చుకోవాలని నీరజ్ మిత్రా (జిమ్ సార్బ్) ప్రయత్నిస్తాడు. ఈ ప్రాజెక్ట్‌కి అవసరమైన లక్ష కోట్లు లంచంగా అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బుని క్లియర్‌గా పంపించేందుకు ఖచ్చితమైన మనిషి అవసరం.. అతడే దీపక్ తేజ్ (నాగార్జున). ఇతను ఓ నిజాయితీగల మాజీ సిబిఐ ఆఫీసర్. రాజకీయ నాయకుల కుట్రలతో జైల్లోకి వెళ్ళిన అతను, కుటుంబ భవిష్యత్ కోసమని ఈ బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్ ప్లాన్‌లో చేరతాడు.
ఈ స్కీమ్ కోసం నాలుగు నగరాల నుంచి నలుగురు బిచ్చగాళ్లను తీసుకొచ్చి బినామీలుగా వాడతారు. దేవా (ధనుష్), దిబియా, ఖేలు, కుష్బూ అనే వీరందరినీ ట్రైనింగ్ ఇచ్చి ఫేక్ కంపెనీలు స్టార్ట్ చేస్తారు. కానీ స్కీమ్ నడుస్తుండగానే, నీరజ్ వాళ్లను చంపాలని ప్లాన్ చేస్తాడు. ఇందులో దిబియా, ఖేలు చనిపోతారు. అనుమానంతో తప్పించుకునే దేవా, రష్మిక (సమీర)ను కలుస్తాడు. తర్వాత కథ ఎలా మలుపులు తిరిగింది అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రమోషన్స్ లో “డబ్బున్నవాడు vs బిచ్చగాడు” అనే కాన్సెప్ట్ చెప్పినా, అసలు కథ మాత్రం బిచ్చగాడే హీరో అన్నట్టు సాగుతుంది. ఫస్ట్ హాఫ్ బాగానే సాగుతుంది కానీ ఎక్కడో చోట కథ కొంచెం లాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకూ ఓ ప్రశాంతమైన బిల్డ్ అప్.. సెకండ్ హాఫ్‌కి ఎంటర్ అయిన తర్వాత కథ స్పీడప్ అవుతుంది. థ్రిల్లింగ్ మూమెంట్స్, దేవా-సమీర జోడీ ప్రయాణం సినిమాకి ఊపు నిస్తుంది. అయితే క్లైమాక్స్ కొంచెం ఊహించదగిన విధంగా ముగించడం మైనస్.
నటీనటులు:
ధనుష్.. బిచ్చగాడిగా నటించి తన యాక్టింగ్‌తో సినిమా మొత్తాన్ని మోశాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పరంగా అద్భుతంగా మెప్పించాడు. తిరుపతిలో రియల్ అడుక్కునే సీన్స్ లో నటించడం నిజంగా ప్రశంసనీయం.
నాగార్జున.. ఓ సీరియస్, లోపల మనస్తాపంతో ఉన్న మాజీ సిబిఐ ఆఫీసర్‌గా తన పాత్రలో ఒదిగిపోయారు.
రష్మిక.. డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది.
జిమ్ సార్బ్.. విలన్ పాత్రలో బాగా చేశాడు. మిగిలిన నటీనటులు కూడా బాగానే నటించారు.
టెక్నికల్ గా:
విజువల్స్ పరంగా సినిమాటోగ్రఫీ మంచి వర్క్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ బూస్ట్. పాటలు రెండు మాత్రమే ఉన్నా, బాగున్నాయి. ఎడిటింగ్ మాత్రం అంతగా బాగోలేదు అనే విమర్శ వినిపిస్తోంది.. కొన్ని కీలక సీన్లు ట్రైలర్ లో ఉన్నా సినిమాలో లేవు.
ఫైనల్ గా:
‘కుబేర’ ఓ కార్పొరేట్ స్కామ్ చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ కథ. ఇందులో బిచ్చగాళ్ల జీవితాల ప్రతిబింబం, ధనవంతుల ప్రపంచంలో వారు ఎలా ఉపయోగించబడతారన్న అంశాన్ని శేఖర్ కమ్ముల తన స్టైల్లో చూపించారు.
ప్రజ్ఞ మీడియా రేటింగ్: 3.25/5