Sridhar Babu: మంత్రి శ్రీధర్‌బాబుకు అవమానం.. ప్రసంగం మధ్యలో అడ్డుకున్న యాంకర్ ఝాన్సీ..!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఒక కార్యక్రమంలో అనుకోని సంఘటన జరిగింది. ‘సీత యాప్’ (She Is The Hero Always – SITHA) ఆవిష్కరణ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తుండగా.. ప్రముఖ యాంకర్ ఝాన్సీ మధ్యలో ఆయనను ఆపేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వేడుకలో సినీ నటి శ్రీలీల అతిథిగా హాజరయ్యారు. ఆమెను వేదికపైకి ఆహ్వానించేందుకు యాంకర్ ఝాన్సీ మంత్రి ప్రసంగాన్ని నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా తన ప్రసంగం ఆపేయడంతో మంత్రి శ్రీధర్‌బాబు ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత విషయాన్ని గ్రహించిన ఆయన స్వల్పంగా నిశ్శబ్దంగా నిలుచుండగా.. ఝాన్సీ “మంత్రివర్యులు క్షమించాలి” అంటూ శ్రీలీలను స్టేజ్ మీదకు ఆహ్వానించారు.

“షీ ఈజ్ ది హీరో ఆల్వేస్” అనేది మహిళా సాధికారతకు మద్దతుగా రూపొందించిన యాప్. కానీ ఈ యాప్ లాంఛ్ సందర్భంగా ఒక హీరోయిన్‌ కోసం రాష్ట్ర మంత్రిని అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యాంకర్ ఝాన్సీ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక సీనియర్ యాంకర్‌గా ఆమె మర్యాదలు పాటించాల్సిందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం పరిస్థితిని ఎంతో సంయమనంతో నిర్వహించారు. చిరునవ్వుతో శ్రీలీలను అభినందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. అయినప్పటికీ, అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకులకు గౌరవం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

Leave a Reply