ఈ రోజుల్లో చాలామందికి ఒక్కటి కాదు, నాలుగు అయిదు క్రెడిట్ కార్డులు ఉండటం సాధారణమే. ఆఫర్లు, డిస్కౌంట్లు, ప్రయోజనాల పేరిట కొందరు క్రెడిట్ కార్డులు తీసుకుంటుంటే.. మరికొందరు అవసరం ఏర్పడుతుందని ఉంచుకుంటారు. కానీ ఈ కార్డులు వాడే సంఖ్య ఒక్కటి, రెండు మాత్రమే. మిగతావి అలానే ఉండిపోతాయి. అప్పుడు సమస్యలు మొదలవుతాయి.
ఇలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డులు క్యాన్సిల్ చేయాలా? వద్దా? అన్న సందేహం వస్తుంది. కానీ క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేసే ముందు కొన్ని కీలక విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేదంటే మీ క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రభావం పడొచ్చు.
క్రెడిట్ కార్డు క్యాన్సిలేషన్‌కి ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు
1. క్రెడిట్ హిస్టరీపై ప్రభావం:
పాత క్రెడిట్ కార్డులు మీకు మంచి క్రెడిట్ హిస్టరీను కలిగిస్తాయి. ముఖ్యంగా 10 ఏళ్లకు పైగా వాడుతున్న కార్డులు అయితే వాటిని రద్దు చేయడం మేలు కాదు.
2. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరుగుతుంది:
ఒక కార్డు క్యాన్సిల్ చేస్తే మీ లభ్యమయ్యే మొత్తం క్రెడిట్ తగ్గుతుంది. మిగతా కార్డులపై మీరు తీసుకునే లోన్ పరిమితి అదే ఉండే అవకాశం ఉంటుంది. ఫలితంగా క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరిగి, బ్యాంకుల దృష్టిలో అప్పుపై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు అనిపిస్తుంది.
3. క్యాన్సిల్ చేయాలంటే ముందుగా చేయాల్సినవి:
కార్డు పై ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించాలి.
రివార్డు పాయింట్లు ఉపయోగించుకుని ఖాళీ చేయాలి.
పేమెంట్ చేసిన తరువాతే క్యాన్సిల్ ప్రక్రియ ప్రారంభించాలి.
కొంత మొత్తమే చెల్లించి సెటిల్ చేస్తే అది స్కోరును దెబ్బతీయవచ్చు.
కార్డుతో లింక్ అయి ఉన్న ఓటీటీ, రీచార్జ్, ఆటోపేమెంట్లను నిలిపివేయాలి.
4. అధికారికంగా బ్యాంకును సమాచారం ఇవ్వాలి:
మీ పేరుతో పాటు అడ్రస్, కార్డు నంబర్, ఫోన్ నంబర్ వివరాలతో ఈమెయిల్ ద్వారా బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా క్యాన్సిలేషన్ అప్లై చేయొచ్చు.
కార్డు రద్దైన నెల తర్వాత క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ చెక్ చేసి “Closed” స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి.
చివరగా..
క్రెడిట్ కార్డులు ఉండటం తప్పుకాదు. కానీ అవి ఎలా వాడుతున్నామన్నదే అసలు విషయం. ఉపయోగం లేకుండా ఉన్న కార్డులను ఎప్పుడైనా క్యాన్సిల్ చేయవచ్చుగానీ.. క్షుణ్నంగా ఆలోచించి, పూర్తి సన్నాహాలు చేసుకున్నాకే ఆ నిర్ణయం తీసుకోవాలి.