Bengaluru Stampede: RCB విజయోత్సవాల్లో విషాదం.. తొక్కిసలాటలో 11 మంది మృతి..!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RCB అభిమానుల సంబరాలు విషాదంలోకి మారాయి. ఐపీఎల్ టైటిల్ విజయం తర్వాత జరిగిన విజయోత్సవాల్లో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది.

అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 11 మంది స్పాట్‌లోనే మృతిచెందగా, 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకురావడంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షాకింగ్‌గా వైరల్ అవుతున్నాయి.

RCB తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేశారు. ఈ వేడుకలకు పాల్గొనడానికి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అయితే అధికారులు తగిన విధంగా భద్రత ఏర్పాట్లు చేయకపోవడం, ఎలాంటి క్యూలైన్ సిస్టమ్ లేకపోవడం వల్ల పరిస్థితి చేయి దాటిపోయింది.

తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వైద్యులు అందరికీ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనతో చిన్నస్వామి స్టేడియంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు ఆదేశించింది. RCB మేనేజ్‌మెంట్ మరియు పోలీసులు దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

Leave a Reply