Bhairavam Review: భైరవం రివ్యూ: ధర్మానికి కట్టుబడిన ముగ్గురు మిత్రులు.. సినిమా ఎలా ఉందంటే..?

ఈ ఏడాది రీమేక్ చిత్రాల్లో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో “భైరవం” ఒకటి. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి మూడు విభిన్నమైన ఇమేజ్‌లు కలిగిన హీరోలతో దర్శకుడు విజయ్ కనకమేడల తీసిన ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదలైంది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘గరుడన్’కు ఇది రీమేక్. అయితే దర్శకుడు కథలో పెద్దగా మార్పులు చేయకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్లు ప్రెజెంటేషన్ మార్చిన విధానం ఆసక్తికరంగా మారింది.

కథ:
ఒక దేవాలయాన్ని నమ్ముకుని జీవించే గ్రామంలో కథ మొదలవుతుంది. వారాహీ అమ్మవారి ఆలయం చాలా ఏళ్లుగా గ్రామానికి ఆధారంగా ఉంటుంది. ఆ గుడికి చెందిన వేల ఎకరాల భూములపై కన్నేసే రాజకీయం, లోపలి కుట్రలు కథకు వెనకబడి ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి (శరత్ లోహితస్య) ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకిచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆ గుడికి ధర్మకర్తగా ఉన్న నాగరత్నమ్మ (జయసుధ) ధర్మం కోసం నిలబడుతుంది.

ఆమె అనూహ్య మరణంతో వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఆమెతో పాటు పెరిగిన ముగ్గురు యువకులు గజపతి వర్మ (మంచు మనోజ్), వరద (నారా రోహిత్), శ్రీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) మిత్రులుగా ఉండగా.. అనుకోని పరిణామాల వల్ల వారి మధ్య విభేదాలు పెరిగి ఓ యుద్ధంగా మారుతుంది. శ్రీను ధర్మకర్తగా నియమించబడటం వెనుక ఉన్న కథ ఏంటి? గజపతికి తన స్నేహితుడు వరద మీద నమ్మకం తగ్గిపోయే దాకా ఏం జరిగింది? ఈ ముగ్గురు ఎలా విడిపోయారు? తిరిగి ఎలా కలుస్తారు? అనేదే ప్రధాన కథ.

నటీనటులు:
మంచు మనోజ్ మరోసారి తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో పాత్రలో ఒదిగిపోయారు. ఆయన నటనలో తేలిన మాస్ టచ్, పాత్రకు డెప్త్ ఇచ్చే ఎమోషనల్ స్ట్రాంగ్ మోమెంట్స్ ఆయనకు ప్లస్ అయ్యాయి. నారా రోహిత్ పాత్రలో అండగా నిలిచారు. లోతైన భావోద్వేగాలతో కూడిన నటనను అందించారు. ముఖ్యంగా స్నేహానికి విలువ ఇచ్చే సన్నివేశాల్లో ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్ చేశాడు. పూనకాలు వచ్చే పాత్రకు తగినట్టు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా కనిపించింది. మాస్ ప్రేక్షకులకు ఇది కొత్త బెల్లంకొండగా కనిపిస్తుంది.

అదితి శంకర్ తన పాత్రలో గ్లామర్ తోడైంది కానీ నటన పరంగా అంత ఇంపాక్ట్ చూపలేకపోయింది. ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ అంతలా సెట్ కాలేదు. ఆనంది, దివ్యా పిళ్లై పాత్రలు చిన్నవైనా కీలకమైనవి. శరత్ లోహితస్య, సంపత్ రాజ్, అజయ్, సందీప్ రాజ్, గోపరాజు రమణ వంటి నటులు తమ పాత్రలను న్యాయంగా పోషించారు.

టెక్నికల్ గా:
విజయ్ కనకమేడల ఇంతకముందు ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి సినిమాలతో నేరేషన్ మీద తన పట్టు చూపించారు. ఈ సినిమాలో కూడా మల్టీ స్టారర్‌ను బలంగా హ్యాండిల్ చేసి, మూడువైపులా ఈగో క్లాష్, మానసిక పోరాటాన్ని హైలైట్ చేశారు. రీమేక్ అయినా కూడా స్క్రీన్‌ప్లేలో యాక్షన్ మరియు ఎమోషన్ మిక్స్ చేయడం విజయ్ స్పెషాలిటీగా నిలిచింది. హరి కె వేదాంతం తీసిన విజువల్స్ చాలా గ్రాండుగా ఉన్నాయి. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌ను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం ముఖ్యంగా బీజీఎంలో మంచి ఎఫెక్ట్ ఇచ్చింది. యాక్షన్ సీన్లకు ఆర్ఆర్ఆర్ హై చేసారు. నిర్మాత కేకే రాధామోహన్ నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు.

ఫైనల్ గా:
“భైరవం” ఓ పక్క ధర్మం కోసం పోరాడే ముగ్గురు మిత్రుల కథ అయితే, మరో పక్క ఈ తరం మాస్ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో నింపిన చిత్రమని చెప్పొచ్చు.

ప్రజ్ఞ మీడియా రేటింగ్: 3/5

Leave a Reply