Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: కేసీఆర్ స్పీచ్‌లో స్పష్టత లేదు.. పొగరుతో పదవులు రావు!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ బోర్డర్ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కర్రెగుట్ట పరిసరాల్లో కూంబింగ్, ఆపరేషన్ కగార్ తదితర అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. నిన్న పీస్ కమిటీ చేసిన సూచనలను జానా రెడ్డితో పంచుకుంటూ, 2005లో జరిగిన శాంతి చర్చల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ కగార్‌పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానాన్ని అధికారికంగా ప్రకటిస్తామని సీఎం స్పష్టం చేశారు.

కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్‌పై నమ్మకం లేకుండా పోయిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రసంగంలో స్పష్టత లేదని, అభద్రతాభావం స్పష్టంగా కనిపించిందని విమర్శించారు. అలాగే, రాహుల్ గాంధీ, తన మధ్య సంబంధం దూరమయ్యిందన్న కేసీఆర్ ఆరోపణలను ఖండించారు. “రాహుల్ గాంధీతో నేను రెగ్యులర్ టచ్‌లోనే ఉన్నాను. అది బయటకు చెప్పాల్సిన అవసరం లేదు,” అని అన్నారు. అవసరాలకు అనుగుణంగా కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు.

పార్టీ అంతర్గత వ్యవహారాలపై వార్నింగ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా సీఎం రేవంత్ స్పందించారు. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని, సీఎల్పీలోనూ ఈ అంశాన్ని గుర్తుచేసినప్పటికీ తీరు మారలేదని విమర్శించారు. “హైదరాబాద్‌లో టైమ్‌పాస్ చేయడం కాదు. ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయాలి,” అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

అంతేకాదు, పార్టీలో ఓపికతో ఉంటేనే పదవులు అందుతాయని, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. “పదవులు రాలేదని నోరుజారితే, అలాంటి వారికి భవిష్యత్తులో అవకాశం ఉండదు” అంటూ స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం మరో 20 ఏళ్ల వరకు కొనసాగుతుందని కూడా తెలిపారు.

Leave a Reply