బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన కలల ప్రాజెక్ట్ ‘మహాభారత’పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, “మహాభారతాన్ని వెండితెరపై చూపించడం నా జీవిత లక్ష్యం. ఈ ఏడాది దీని పనులు ప్రారంభించాలనే ఆశ ఉంది,” అంటూ చెప్పారు.
మహాభారతం.. కలల ప్రాజెక్ట్
“ఈ తరం ప్రేక్షకులకు మహాభారత గాధను కొత్తగా పరిచయం చేయాలన్నది నా కోరిక,” అని తెలిపిన అమీర్ ఖాన్, ఈ ప్రాజెక్ట్ సాధారణ సినిమాగా కాకుండా ఓ గ్రాండ్ సిరీస్‌గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకే సినిమాతో మొత్తం కథను న్యాయం చేయలేమని భావించి, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ తరహాలో పలు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు.
తయారీకి ఎన్నో సంవత్సరాలు..
అమీర్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ప్రాథమిక దశలో ఉన్నాయి. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే పాత్రలకు సరిపోయే నటీనటుల ఎంపిక జరుగుతుందన్నారు. తాను ఈ సినిమాలో నటిస్తారా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
రూ.1000 కోట్ల బడ్జెట్!
ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ కోసం రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేయనున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు, స్క్రిప్ట్ పనుల కోసం గతంలో రాకేష్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకున్నారని కూడా సమాచారం. అమీర్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు.
ప్రస్తుతం అమీర్ బిజీగా ఉన్న సినిమా..?
2022లో విడుదలైన ‘లాల్ సింగ్ చద్దా’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో కొంత విరామం తీసుకున్న అమీర్ ఖాన్, ప్రస్తుతం ‘సీతారే జమీన్ పర్’ చిత్రంపై దృష్టి సారించారు. ఇది 2007లో వచ్చిన హిట్ మూవీ ‘తారే జమీన్ పర్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.