GVMC Mayor: జీవీఎంసీపై కూటమి జెండా.. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయం..!

విశాఖలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి 74 మంది మద్దతుతో అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదింపజేసింది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా కలిపి మెజారిటీను సాధించింది. ఈ విజయం ద్వారా కూటమి మేయర్ పదవిని సొంతం చేసుకుంటూ, వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది.

శనివారం ఉదయం ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో, సభ్యుల హాజరును నమోదు చేసి ఓటింగ్ చేపట్టారు. చివరికి 74 మంది అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడంతో తీర్మానం ఆమోదం పొందింది. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకాకుండా విప్ ఇచ్చినా, వ్యూహం ఫలించలేదు. దీంతో వైసీపీ మేయర్ హరివెంకట కుమారి పదవి కోల్పోయారు.

ఈ ఫలితాలపై స్పందించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, “వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాం. త్వరలోనే కొత్త మేయర్‌ను ఎన్నుకుని విశాఖ అభివృద్ధికి దోహదపడతాం” అని చెప్పారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి ఓటు వేయడం గమనార్హం. “ధర్మం, న్యాయం గెలిచాయి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో విశాఖలో రాజకీయ దృశ్యం మార్చే దిశగా కూటమి అడుగులు వేస్తోంది. ఆదివారం కొత్త మేయర్ ఎన్నికకు అవకాశం ఉండగా, కూటమిలో ఎవరు పదవి బాధ్యతలు స్వీకరిస్తారో చూడాలి. మొత్తంగా జీవీఎంసీ ఎన్నికల ఫలితాలు విశాఖ రాజకీయాలకు కొత్త మలుపు తిప్పాయి.

Leave a Reply