కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా, విజయశాంతి కీలక పాత్రలో నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో నడిచే యాక్షన్ డ్రామాగా రూపొందింది.
కథ సంగతేంటంటే?
వైజయంతి (విజయశాంతి) ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్. ఆమె తన కుమారుడు అర్జున్ (కళ్యాణ్ రామ్) కూడా పోలీస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటుంది. కానీ ఓ దుర్వశనంతో అర్జున్ తన తండ్రిని చంపిన వారిలో ఒకరిని హత్య చేస్తాడు. దీని వల్ల వైజయంతి తన కుమారునిపై హత్య కేసు వేసి దూరమవుతుంది. ఆ కేసు నడుస్తున్న సమయంలో అర్జున్ వైజాగ్‌లో ఓ జాలరి పేటలో తన భార్య చిత్ర (సయీ మంజ్రేకర్)తో కలిసి జీవిస్తూ రౌడీగా ఎదుగుతాడు.
తల్లి నుంచి దూరమైనప్పటికీ, అర్జున్ ఆమెను చూసేందుకు, కలవాలనే తపనతో ఉంటాడు. ఒక సమయంలో వైజయంతిపై హత్యాయత్నం జరగడంతో కథ మలుపు తిరుగుతుంది. అటాక్ చేసినవారు ఎవరు? అర్జున్ తండ్రిని ఎందుకు చంపాడు? తల్లి కొడుకులు ఎందుకు విడిపోయారు? వీరిద్దరూ మళ్లీ కలిసారా? అన్నదానికి సమాధానం తెరపై తెలుస్తుంది.
సినిమా విశ్లేషణ:
తల్లి కొడుకు మధ్య ఎమోషనల్ డ్రామా కేంద్ర బిందువుగా నడిచే ఈ సినిమా, మొదటి భాగంలో రొటీన్ కమర్షియల్ మాసాలా కథలా కొనసాగుతుంది. అయితే, రెండో భాగంలో ట్విస్ట్స్, ఫ్లాష్‌బ్యాక్ ద్వారా ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అర్జున్ తల్లి కోసం చేసే త్యాగం ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది.
కథలో కొత్తదనం కొంత ఉన్నా, సాగతీత ఉండడం, కొన్ని సీన్స్‌లో లాజిక్ లేకపోవడం మైనస్ పాయింట్లు. యాక్షన్ సీన్స్, హీరో-విలన్ ఎలివేషన్లు, ఎమోషనల్ కానెక్ట్ మాత్రం బాగున్నాయి. తల్లి కొడుకుల మధ్య వచ్చే క్లాష్ సినిమాకు బలమైన ముడిగా మారింది.
నటీనటుల ప్రదర్శన:
కళ్యాణ్ రామ్ తన స్టైల్‌లో నటించినా, క్లైమాక్స్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. విజయశాంతి తన పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌ను మరోసారి తెరపై అద్భుతంగా చేసింది. ఈ వయసులోనూ ఆమె చేసిన యాక్షన్ సీన్లు ప్రశంసించదగ్గవి. సయీ మంజ్రేకర్ పాత్ర మాత్రం చాలా పరిమితంగా ఉంది. శ్రీకాంత్, బబ్లూ పృథ్వీరాజ్, సోహైల్ ఖాన్ లాంటి ఇతర నటులు తమ పాత్రల్లో ఫర్వాలేదు అనిపించారు.
టెక్నికల్ అంశాలు:
సినిమాటోగ్రఫీ స్టాండర్డ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు యావరేజ్‌గా ఉంటాయి. దర్శకుడు రెగ్యులర్ కథను కొత్త స్క్రీన్‌ప్లే, కొత్త క్లైమాక్స్ ద్వారా చెప్పేందుకు ప్రయత్నించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ వర్డిక్ట్:
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఓ రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా అయినా, తల్లి కొడుకుల సెంటిమెంట్ మెప్పించేలా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చిన ఎమోషన్ సినిమాకు పిల్లర్ గా నిలుస్తుంది. తల్లిపై ప్రేమ చూపించే కొడుకు పాత్రను బలంగా చూపించారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి కి ప్రజ్ఞ మీడియా ఇచ్ఛే రేటింగ్: 2.75/5