తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీని నియమించారు. ఈ కమిటీకి సీనియర్ నటి జయసుధ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అవార్డుల ఎంపిక పూర్తిగా నిష్పక్షపాతంగా జరగాలని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు సూచించారు.
తెలుగు సినిమాను ప్రోత్సహించేందుకు గద్దర్ అవార్డులు
తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులను అందిస్తోంది. ఎన్నో విభాగాల్లో నామినేషన్లు రావడంతో, అవార్డుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, న్యాయంగా నిర్వహించేందుకు అనుభవజ్ఞులైన కమిటీని నియమించారు.
జ్యూరీ సభ్యుల లిస్ట్ ఇదే
ఈ జ్యూరీలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అనుభవజ్ఞులు, జర్నలిస్టులు భాగమయ్యారు:
జీవిత రాజశేఖర్ – నటి
దశరథ్, వీఎన్ ఆదిత్య, నందిని రెడ్డి, ఎల్. శ్రీనాథ్, శివ నాగేశ్వరరావు, ఉమా మహేశ్వరరావు – దర్శకులు
కాసర్ల శ్యామ్ – గీత రచయిత
ఏడిద రాజా – నిర్మాత
విజయ్ కుమార్ రావు – ఎగ్జిబిటర్
గౌతమ్ – ఫిల్మ్ అనలిస్ట్
వెంకట రమణ, లక్ష్మీ నారాయణ – జర్నలిస్టులు
ఎఫ్డీసీ ఎండీ – అధికార సభ్యుడు
1248 నామినేషన్లు – ఏప్రిల్ 21 నుంచి స్క్రీనింగ్ ప్రారంభం
గద్దర్ అవార్డుల కోసం ఇప్పటి వరకు 1248 విభాగాల్లో నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో 1172 దరఖాస్తులు వ్యక్తిగత కేటగిరీలో ఉండగా, ఫీచర్ ఫిల్మ్స్, చిల్డ్రన్స్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు వంటి విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. జ్యూరీ సభ్యులు ఈ అప్లికేషన్లను ఏప్రిల్ 21వ తేదీ నుంచి స్క్రీనింగ్ చేయనున్నారు.
చలనచిత్ర అవార్డులపై అపూర్వ స్పందన
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, “ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి స్థాయిలో స్పందన రాలేదు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను ఇస్తుండటం గర్వకారణం” అని పేర్కొన్నారు. అవార్డుల ఎంపిక వ్యవహారం పూర్తిగా నిష్పక్షపాతంగా సాగాలన్నదే ప్రభుత్వ దృక్పథమని స్పష్టం చేశారు.