Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు 2025: తొలిసారిగా తెలంగాణలో.. తేదీలు, ఏర్పాట్లు, విశేషాలు..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఈసారి ప్రధాన కేంద్రమవుతోంది. 2025 మే 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజులపాటు ఈ పుష్కరాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. కాళేశ్వరం ఆలయ అర్చకుల ప్రకారం, మే 14న రాత్రి 10.35 గంటలకు పుష్కర కాలం మొదలవుతుంది. మే 15 సూర్యోదయంతో పుణ్యస్నానాలు ప్రారంభమవుతాయి.

ఘనంగా పుష్కరాల నిర్వహణ – రూ. 35 కోట్ల మంజూరు
పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో రూ. 35 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో ఘాట్లు, రోడ్లు, డ్రైనేజీలు, శానిటేషన్, టెంట్ సిటీలు వంటి మౌలిక సౌకర్యాల ఏర్పాటు జరుగుతోంది.

డిజిటల్ ఫెసిలిటీలు – వెబ్ పోర్టల్, యాప్ ప్రారంభం
పుష్కరాల సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తెచ్చే నిమిత్తం, మంత్రి కొండా సురేఖ ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుష్కరాల యాప్‌ను ప్రారంభించారు. భక్తులకు రూట్ మ్యాపులు, ఘాట్ వివరాలు, హోమాల సమాచారం ఈ యాప్ ద్వారా అందించనున్నారు.

ఆధ్యాత్మికతకు కొత్త ఒరవడి
పుష్కరాల సమయంలో 17 అడుగుల సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. కాశీ నుంచి వచ్చే పండితులు, స్థానిక పండితులతో కలిసి ప్రతిరోజూ ప్రత్యేక హోమాలు, హారతులు నిర్వహించనున్నారు. మిథున రాశిలో బృహస్పతి ప్రవేశించేదే ఈ పండుగకు సంకేతం.

లక్షలాది భక్తుల రాక.. ఏర్పాట్లు అద్భుతంగా
టెంపరరీ టెంట్ సిటీల్లో వందల పడకలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి రావనున్నారని అంచనా. రోజుకు కనీసం లక్ష మంది భక్తుల రాక ఉండే అవకాశముంది.

త్రివేణి సంగమం ప్రాధాన్యం
సరస్వతి నది అంతర్వాహినిగా, గోదావరి మరియు ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పడుతున్న కాళేశ్వరం పుష్కరాలకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాక, రాష్ట్రం మతపరమైన వారసత్వానికి నిదర్శనం.

Leave a Reply