Google Layoffs: ఒక్క రోజులో వందల మంది ఉద్యోగులకు గూగుల్ గుడ్‌బై..! అసలేం జరుగుతోంది..?

టెక్ ప్రపంచాన్ని మరోసారి షేక్ చేసింది గూగుల్. ఒక్కరోజులోనే వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. గురువారం రోజు గూగుల్ తన కీలక విభాగాలైన ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ హార్డ్‌వేర్, క్రోమ్ బ్రౌజర్‌ డెవలప్‌మెంట్‌ టీమ్‌ల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించినట్టు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటివరకు సంస్థ నుంచీ అధికారిక ప్రకటన వెలువడనిప్పటికీ, ఈ వార్త టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సమాచారం ప్రముఖ టెక్ మీడియా సంస్థ “ది ఇన్ఫర్మేషన్” ద్వారా వెలుగులోకి వచ్చింది. సంస్థ పరిస్థితుల గురించి నేరుగా తెలిసిన వ్యక్తిని ఉటంకిస్తూ వారు ఈ లే ఆఫ్స్‌ జరిపారని స్పష్టంగా రిపోర్ట్ చేశారు. పిక్సెల్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్, ఆండ్రాయిడ్ వంటి ముఖ్యమైన విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులను కూడా ఈ తొలగింపుల్లో భాగంగా పంపించినట్టు సమాచారం.

అయితే ఈ షాక్ లే ఆఫ్స్ వెనుక గూగుల్ వ్యూహం ఏమిటో స్పష్టత రావాల్సి ఉంది. టెక్ ఇండస్ట్రీలో ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి, జెనరేటివ్ ఏఐ ఆధారిత సేవల దిశగా గూగుల్ దృష్టి మళ్లించడం వంటి అంశాలే కారణమా? లేక సంస్థ అంతర్గత రీ-స్ట్రక్చరింగ్ ప్రక్రియలో భాగమా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

గతేడాది నుంచీ పెద్ద టెక్ సంస్థలు ఉద్యోగుల తొలగింపులపైనా, వ్యయ నియంత్రణ చర్యలపైనా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గూగుల్ ఇప్పటికే 2023లోనూ చాలా విభాగాల్లో ఉద్యోగులను తొలిగించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే ధోరణి మళ్లీ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది.

ఇక గూగుల్ అధికారిక ప్రకటన వస్తే అసలు లే ఆఫ్స్ వెనుక ఉన్న నిజమైన కారణాలు మనకి తెలుస్తుంది. అప్పటివరకు ఇదే చర్చ కొనసాగే అవకాశం వుంది.

Leave a Reply