పవన్ కుమారుడికి అగ్ని ప్రమాదం.. చేతులు, కాళ్లకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తీవ్ర విషాదంలో ఉన్నారు. వ్యక్తిగతంగా చాలా తీవ్రమైన సంఘటన ఎదురైనా, తన బాధ్యతల్ని పక్కన పెట్టకుండా ప్రజల కోసం ముందుకు సాగుతున్న పవన్ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడమే కాక, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు సమాచారం. వెంటనే పాఠశాల సిబ్బంది అప్రమత్తమై స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్క్ పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

ఈ విషయం తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. సహజంగా ఇలాంటి సమయాల్లో ఎవరైనా తన కుమారుడిని పరామర్శించేందుకు వెంటనే వెళ్లిపోతారు. కానీ పవన్ మాత్రం వేరే విధంగా స్పందించారు.

“అరకు సమీపంలోని కురిడి గ్రామానికి నేను మాట ఇచ్చాను. అక్కడి గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను విస్మరించలేను,” అని పవన్ మీడియాతో స్పష్టం చేశారు.

ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనీ, వాటిని పూర్తి చేసిన తర్వాతే సింగపూర్‌కు వెళ్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణులు, అభిమానులు, సాధారణ ప్రజలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రమాదంలో గాయపడిన కుమారుని పట్ల బాధ, బాధ్యతల పట్ల నిబద్ధత.. ఈ రెండింటిని బాలన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ చూపిస్తున్న లీడర్‌షిప్ ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

మరోవైపు, మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగవుతుందని కుటుంబ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అభిమానులు, నేతలు, ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరిన వెంటనే సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

Leave a Reply