గుండె సమస్యలతో బాధపడే పిల్లలకు నిమ్స్ హాస్పిటల్ గొప్ప ఆశగా మారింది. పుట్టుకతోనే గుండె సంబంధిత లోపాలు ఉన్న చిన్నారులకు ప్రాణదాయకమైన చికిత్సలు అందిస్తూ, ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది. ముఖ్యంగా, ఆరోగ్య శ్రీ (Aarogyasri), సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా నిమ్స్ హాస్పిటల్ పూర్తి ఉచితంగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో అత్యున్నత వైద్యం అందించడమే కాకుండా, అధునాతన వైద్య సదుపాయాలతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం విజయవంతంగా చేపడుతోంది.
ఇటీవల గుండె సమస్యలు చిన్నారుల్లో అధికంగా కనిపిస్తున్నాయి. జన్మనుంచే హార్ట్‌లో హోల్స్ (Holes in the Heart), అబ్ నార్మల్ కనెక్షన్స్ (Abnormal Connections), గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం (Irregular Heartbeat) వంటి సమస్యలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు సమయానికి సరైన చికిత్స అందకపోతే, పిల్లల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం పడే ప్రమాదం ఉంది. కానీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ సర్జరీలు చేయించుకోవడం సామాన్య ప్రజలకు సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో, నిమ్స్ తన అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఎందరికో కొత్త జీవితం అందిస్తోంది.
రెండేళ్ల కిందట నిమ్స్‌లో పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగాన్ని ప్రత్యేకంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా గుండె సంబంధిత సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ప్రారంభ దశలో నెలకు 20-25 సర్జరీలు చేయగా, ప్రస్తుతం నెలకు 35కి పైగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తెలంగాణ మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచీ తల్లిదండ్రులు తమ పిల్లల చికిత్స కోసం నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
అప్పుడే పుట్టిన పిల్లలకే కాకుండా.. 1, 2, 5 సంవత్సరాల పిల్లలకు అవసరమయ్యే సర్జరీలు కూడా నిమ్స్‌లో నిర్వహిస్తున్నారు. చాలా చిన్న వయస్సు పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. అలాంటి సమయంలో, ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న కుటుంబాలకు నిమ్స్ గొప్ప ఆశ్రయంగా నిలుస్తోంది.
నిమ్స్‌లో కార్డియో థోరాసిక్ హెచ్ఓడీ డాక్టర్ అమరేష్ రావు నేతృత్వంలోని డాక్టర్ల బృందం.. డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ గోపాల్.. చిన్నారులకు అత్యుత్తమ గుండె శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్తో, తక్కువ కాలంలోనే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు.
గుండె సమస్యలతో బాధపడే పిల్లల తల్లిదండ్రులు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నిమ్స్ హాస్పిటల్, ఓల్డ్ బిల్డింగ్‌లోని 6వ వార్డులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య డాక్టర్ అమరేశ్‌ను సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం 78933 37836 నంబర్‌కు కాల్ చేయొచ్చు.