ఏపీ కలెక్టర్ల సమావేశం.. మెగా DSC, ‘తల్లికి వందనం’ పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్ల సమావేశం ఈరోజు అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యంగా పరిపాలన సాగించేందుకు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారం దుర్వినియోగం చేయకుండా ప్రజాసేవలో ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, “ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుంది. కొందరు అభివృద్ధి చేస్తే, మరికొందరు నాశనం చేస్తారు,” అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలకు పెద్దపీట వేస్తున్నామని తెలియజేశారు. ఏప్రిల్ తొలి వారంలో మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. DSC నిర్వహణ పకడ్బంధీగా ఉంటుందని, అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రామాణిక విధానాలను పాటిస్తామని చెప్పారు. గతంలో మెజారిటీ ఉద్యోగాల భర్తీ తమ ప్రభుత్వం కాలంలోనే జరిగాయని గుర్తుచేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన పింఛను మొత్తం రూ. 400 నుండి రూ. 4,000కు పెంచామని, ఇది దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించే దీపం పథకం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. బీసీల ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10% రిజర్వేషన్ ఇచ్చామని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు జీఎస్టీ రద్దు చేశామని తెలిపారు. మే నెలలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తామని, ప్రతి తల్లి తన పిల్లల సంఖ్యను అనుసరించి ఒక్కో బిడ్డకు రూ. 15,000 అందించబడుతుందని వెల్లడించారు.

రాజధాని నిర్మాణానికి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ఇచ్చారని, అదే మోడల్‌ను విశాఖ లేదా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఉపయోగించాలని తెలిపారు. రాష్ట్రంలో 55,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే పనులు, 75,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

చివరగా, సంక్షేమ పథకాలు దాతృత్వంగా కాకుండా, ప్రతి అర్హులైన లబ్ధిదారునికి అందాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు కలెక్టర్లు శ్రమించాలన్నారు.

Leave a Reply