Donald Trump: ట్రంప్‌కు భారీ షాక్.. అమెరికా సీక్రెట్ మిషన్ లీక్! ఏం జరిగిందంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తీరని ఎదురుదెబ్బ తగిలింది. యెమెన్‌లోని హౌతీ గ్రూపుపై అమెరికా మిలిటరీ దాడులను ప్లాన్ చేసిన కీలక భద్రతా సమాచారం లీకైంది. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు, ద అట్లాంటిక్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్ వెల్లడించారు.

గోల్డ్‌బెర్గ్ వివరించిన వివరాల ప్రకారం, అమెరికా జాతీయ భద్రతా అధికారులు హౌతీ గ్రూపుపై దాడుల ప్రణాళికను ఓ వాణిజ్య సందేశ సేవలో గ్రూప్ చాట్ ద్వారా చర్చించారు. ఈ చాట్‌లో అమెరికా టార్గెట్లు, ఆయుధాల మోహరింపు, దాడుల తీరుపై ముఖ్యమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ గ్రూప్ చాట్‌లో అనుకోకుండా గోల్డ్‌బెర్గ్‌ను జత చేయడంతో ఈ లీక్ బయటపడింది.

గోల్డ్‌బెర్గ్ చెప్పిన ప్రకారం, ఆయనను రెండు రోజుల ముందు ఈ గ్రూప్ చాట్‌లో యాడ్ చేశారు. దీంతో, అమెరికా రహస్య మిలిటరీ ఆపరేషన్‌పై చర్చ జరుగుతున్న విషయాన్ని గమనించారు. చాట్‌లో “వాన్స్” అనే వ్యక్తి దాడులకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, షిప్పింగ్‌పై దాడులు జరిగితే యూరప్‌కు మళ్లీ మద్దతుగా అమెరికా వెళ్లాల్సి ఉంటుందని చాట్‌లో చర్చించుకున్నారు.

ఈ సమాచారం బయటకు రావడంతో జాతీయ భద్రతా మండలి వెంటనే స్పందించింది. ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మాట్లాడుతూ, ఈ లీక్‌పై ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, జర్నలిస్టు అనుకోకుండా గ్రూప్‌లోకి ఎలా చేరుకున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించకపోయినా, ఇది ట్రంప్ పాలకవర్గం అజాగ్రత్త వల్ల జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం అనుకోకుండా బయటపడడం అమెరికా రక్షణ వ్యవస్థలో సంచలనంగా మారింది.

ఈ లీక్ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దేశ భద్రతా వ్యవస్థలో ఇటువంటి పొరపాట్లు మరింత ప్రమాదకర పరిస్థితులను తీసుకురావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply