Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంటులో లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు.. ఘన సత్కారం

సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తన విజయయాత్రను కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పార్లమెంటులో ఆయనను ఘనంగా సత్కరించి, లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. చిరంజీవి సినీ రంగానికి అందించిన అపూర్వమైన సేవలకు గానూ ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం లండన్‌లోని పార్లమెంట్ హాలులో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పార్లమెంట్‌ సభ్యులు సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌మాన్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి సినీ రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా అందించిన విశేషమైన సేవలకు గానూ యూకే పార్లమెంట్ ఈ గౌరవాన్ని అందజేసింది.

1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించిన చిరంజీవి, క్రమంగా తన అసాధారణ నటన, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అతని సినీ ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలతో నిండింది. ఆయన్ని ‘మెగాస్టార్’గా అభివర్ణించడమే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవికి గౌరవ పురస్కారాలు వరుసగా లభిస్తున్నాయి. 156 సినిమాల్లో నటించి, 537 పాటలకు స్టెప్పులు వేసి, 24 వేలకుపైగా డాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించినందుకు గాను 2023లో గిన్నిస్ రికార్డుతో పాటు, అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, ఐఫా అవార్డు, భారత ప్రభుత్వ అత్యున్నత గౌరవాల్లో ఒకటైన పద్మ విభూషణ్‌ను అందుకున్నారు.

ప్రస్తుతం చిరంజీవి “విశ్వంభర” అనే ప్రతిష్టాత్మక సినిమా చేస్తుండగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్టును కూడా ప్రకటించారు. ‘విశ్వంభర’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది చిరంజీవి కెరీర్‌లో మరో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం, కృషి, ప్రతిభ ఈరోజు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందుతుండటం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా మారింది. యూకే పార్లమెంటులో లభించిన ఈ గౌరవం చిరంజీవి స్థాయిని మరింత పెంచింది. మరికొన్ని దశాబ్దాలు ఆయన సినీ పరిశ్రమకు సేవలు అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply