‘SSMB 29’ నుంచి మహేశ్, ప్రియాంక అదిరే ఫొటోలు.. వాలీబాల్ ఆడిన రాజమౌళి!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ‘SSMB 29’ మూవీ ఒడిశా షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. గత 15 రోజులుగా కోరాపుట్ జిల్లాలో సాగిన ఈ భారీ షెడ్యూల్‌లో హీరో మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక సన్నివేశాల్లో పాల్గొన్నారు. తాజా షెడ్యూల్ ముగియడంతో మహేశ్, ప్రియాంక, రాజమౌళి అభిమానుల కోసం ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ షెడ్యూల్‌లో మాలి, పుట్‌సీల్‌, బాల్డ్ ప్రాంతాల్లో గ్రాండ్ యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కించిన జక్కన్న.. సహజసిద్ధమైన లొకేషన్లను మెండుగా ఉపయోగించుకున్నారు. స్థానికులు తమ ప్రాంతంలో ఇలాంటి భారీ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తెలుసుకుని చిత్రబృందాన్ని కలవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అభిమానులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పొట్టంగి ఎమ్మెల్యే రామ్‌చంద్ర కడం మూవీ టీమ్‌ను కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

సినిమా షూటింగ్‌తో పాటు చిత్రబృందం అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ప్రశాంత వాతావరణాన్ని ఎంజాయ్ చేసింది. విరామ సమయంలో రాజమౌళి వాలీబాల్ ఆడిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే మూవీ టీమ్ హైదరాబాద్‌కు బయలుదేరగా, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి మాత్రం మరుసటి రోజు ఉదయం ఒడిశా నుండి బయలుదేరారు.

ఇప్పటికే ‘SSMB 29’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతుండటంతో ప్రేక్షకులు, అభిమానులు గట్టిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మహేశ్ లుక్‌ గురించి అనేక ఊహాగానాలు వస్తుండగా, ప్రియాంక చోప్రా గ్లామర్ కమ్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుందని టాక్. మరోవైపు, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందోనన్న ఆసక్తి అభిమానులను కట్టిపడేస్తోంది.

Leave a Reply