తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించిన తీరును ఎత్తిచూపారు. 2022 బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించడం, మహిళా గవర్నర్ను అగౌరవపరిచే విధంగా వ్యవహరించడం బీఆర్ఎస్ దురభిప్రాయం అని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అన్ని వ్యవస్థలను సముచితంగా నిర్వహిస్తోందని రేవంత్ స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రసంగంలో మంత్రివర్గం ఆమోదించిన అంశాలే ఉన్నాయని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేరుస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని, కేవలం అధికార దాహంతో వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టడం వారి అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో 70% మంది వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారని, వారికి మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల రుణమాఫీ కోసం రూ. 20,624 కోట్లు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. అంతేకాదు, రైతు భరోసాను రూ. 12,000కు పెంచి, కేవలం మూడు నెలల్లోనే రూ. 7,625 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని ఆరోపించిన రేవంత్, బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడం, రైతులను అప్పులపాలు చేయడం వారి రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పునఃప్రారంభించిందని, సన్న వడ్లకు రూ. 1,206 కోట్ల బోనస్ ఇచ్చిందని తెలిపారు.
తెలంగాణ రైతుల పాలిట ప్రాణాధారమైన కృష్ణా నది జలాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పోరాడలేదని సీఎం ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును విస్తరించేందుకు అనుమతిచ్చి, తెలంగాణకు శాశ్వతంగా నీటి లోటును కలిగించిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంతో కలసి 299 టీఎంసీల నీటిని కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అంగీకరించిందని, ఇది తెలంగాణ రైతుల పట్ల తీవ్ర ద్రోహమని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించిన రేవంత్, చివరకు ఆ ప్రాజెక్టు నుంచి తగినన్ని నీళ్లు కూడా రావడం లేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ప్రాజెక్టుల రూపురేఖలు మార్చి రైతులకు అనుకూలంగా పని చేయకుండా చేసిందని విమర్శించారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామిక విలువలు పూర్తిగా కూలిపోయాయని రేవంత్ అన్నారు. రైతులను నిర్లక్ష్యం చేయడం, నీటి వనరులను తక్కువ చేసి రైతులను ఇబ్బందులకు గురిచేయడం, నదీ జలాల సమస్యను పెద్దగా పట్టించుకోకుండా ఉండటం.. ఈ అన్ని అంశాలు కేసీఆర్ వైఫల్యాన్ని చూపిస్తున్నాయి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
“కేసీఆర్ వద్ద కుర్చీని ప్రజలు గుంజేశారు. నన్ను కూర్చోబెట్టారు. ఆయనకు ఇప్పుడు ఉన్నది కేవలం ప్రతిపక్ష హోదా మాత్రమే. అదే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావులకు కావాలని చూస్తున్నారు. కానీ ప్రజలు బీఆర్ఎస్ ను పూర్తిగా తిరస్కరించారనే వాస్తవం వాళ్లు అర్థం చేసుకోవాలి,” అని రేవంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ 100 ఏళ్లూ ప్రతిపక్షంలోనే ఉండాలి,” అంటూ తన ప్రసంగాన్ని ముగించిన రేవంత్, టీఆర్ఎస్ హయాంలో రైతులకు జరిగిన అన్యాయంపై తెరపై తెచ్చి, కొత్త ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎలా కృషి చేస్తోందో వివరించారు.