క్రియేటివిటీ అనేది సినిమాల్లో కొత్తదనాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే అదే ఓ అద్భుతమైన హుక్ స్టెప్‌ను సృష్టించగలదు… లేదా దాని మీద విమర్శలు రావడానికీ కారణం కావచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
తాజాగా, ‘రాబిన్ హుడ్’ సినిమాలో కేతిక శర్మ కోసం శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పాట మొత్తం ఎలా ఉన్నా, ఒక్క హుక్ స్టెప్ మాత్రం అందరికీ ప్రత్యేకంగా గుర్తు పట్టేలా ఉంది. కానీ, అదే కొంతమందికి అసౌకర్యంగా అనిపించింది. “ఇది డ్యాన్స్ క్రియేటివిటీ కాదు, అసౌకర్యం కలిగించే విధంగా ఉందే!” అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
అసలు ఇది కొత్త విషయం కాదు. గతంలోనూ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో కొన్ని హుక్ స్టెప్స్ వివాదాలకు కారణమయ్యాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరోయిన్ బ్యాక్ పాకెట్లో హీరో చేయిపెట్టే స్టెప్ అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ విషయంలో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
ఇక ‘పుష్ప 2’ లోని పీలింగ్స్ స్టెప్స్ పై కూడా అభ్యంతరాలు వచ్చాయి. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో స్టెప్స్ అయితే పర్వాలేదు కానీ, ఆ స్టెప్స్‌లో హీరోయిన్లను చూపించిన విధానం కొన్ని వర్గాల్లో విమర్శలు ఎదుర్కొన్నాయి.
అంతేకాదు, ‘డాకూ మహారాజ్’ లో ‘దబిడి దిబిడి’ పాటలోని స్టెప్స్ కూడా ట్రోలింగ్‌కు గురయ్యాయి. బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ కూడా “ఇలాంటి స్టెప్స్ అవసరమా?” అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తాజాగా, ‘రాబిన్ హుడ్’ పాటలోని హుక్ స్టెప్ గురించి అయితే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. కేతిక శర్మ చేసిన స్టెప్పులు హద్దులు దాటాయని కొందరు అంటుంటే, ఇంకొందరు మాత్రం “ఇది క్రియేటివిటీ పేరుతో అసహజంగా అనిపిస్తోంది” అని అభిప్రాయపడుతున్నారు.
శేఖర్ మాస్టర్ స్టెప్స్ అంటే ఒక బ్రాండ్. కానీ, ఆ బ్రాండ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారడం చూస్తుంటే, ఆయన కాస్త వెనక్కి తగ్గి తన స్టెప్స్‌పై ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. హీరోయిన్లతో వేయించే స్టెప్పుల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఇంత వివాదం జరగడంతో శేఖర్ మాస్టర్ ఇకపై తన కొరియోగ్రఫీలో మార్పులు చేస్తారా? లేక తన స్టైల్‌ను కొనసాగిస్తారా? అనేది చూడాలి.