హైదరాబాద్ ప్రజా రవాణాలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. ట్రాఫిక్ టెన్షన్స్ లేకుండా తక్కువ సమయంలోనే ప్రయాణం చేయాలంటే మెట్రో బెస్ట్ ఆప్షన్. ప్రతిరోజూ లక్షల మంది మెట్రో ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే, మెట్రో రైలులో ప్రయాణించేప్పుడు ఏం తీసుకెళ్లొచ్చు? ఏం తీసుకెళ్లకూడదు? అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే బ్యాగేజీల తనిఖీల సమయంలో భద్రతా సిబ్బందితో గొడవలు పడుతుంటారు. అందుకే ఈ విషయంపై స్పష్టత ఇచ్చేందుకు హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఎంట్రన్స్ వద్దే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి, నిషేధిత వస్తువుల జాబితాను పొందుపర్చింది.
మెట్రోలో తుపాకులు, మందుగుండు సామగ్రి, క్రీడల తుపాకీ, గన్ లైటర్, ఎయిర్ రైఫిల్, స్టన్ గన్, షాక్ ఇచ్చే పరికరాలు తీసుకెళ్లకూడదు. గొడ్డలి, సుత్తి, గడ్డపార, రంపం, 7 అంగుళాల కంటే పొడవైన స్క్రూ డ్రైవర్, కట్టింగ్ ప్లేయర్ వంటి పరికరాలు అనుమతించరు. మద్యంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.. సీల్ వేసి ఉన్న రెండు సీసాలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే, పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. కేవలం భద్రతా సిబ్బంది తీసుకెళ్లే జాగిలాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
కొన్ని వస్తువులకు మండే స్వభావం ఉండటంతో అవి కూడా నిషేధితంగా ప్రకటించారు. రేడియోధార్మిక పదార్థాలు, యాసిడ్స్, విష పదార్థాలు ఈ జాబితాలో ఉన్నాయి. మానవుల లేదా జంతువుల రక్తం, ఎండిన లేదా కుళ్లిన మాంసం, జంతువుల మృతదేహాలు, సీల్ వేయని మొక్కలు, ఎముకలు, ఎరువులు, పాడైన కూరగాయలు, ప్యాక్ చేయని చేపలు, మాంసం తీసుకెళ్లడానికి అధికారులు అనుమతించరు. గన్ పౌడర్, డైనమైట్, బాణసంచా, హ్యాండ్ గ్రనేడ్, ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు తీసుకెళ్లడం కూడా నిషిద్ధం. అయితే విధి నిర్వహణలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ దళాలకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది.
మెట్రో రైలులో ప్రయాణికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం. మెట్రోరైలు చట్టం ప్రకారం, పదునైన వస్తువులు, తుపాకులు, పేలుడు పదార్థాలు, మండే వస్తువులు, రసాయనాలు, ప్రమాదకర వస్తువులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. కాబట్టి, మెట్రో రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులు ఈ నిబంధనలను గుర్తుంచుకోవాలి.